భారతదేశ చరిత్రను అంశాల వారీగా, శాస్త్రబద్ధంగా పరిశీలించి, వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం అని ముందుగా చెప్పాలి. పూర్తిగా భిన్నమైన, నూతన ప్రణాళికతో ఈ పుస్తకాన్ని రచించానని వేరుగా చెప్పనవసరం లేదు. దీనిలో రాజకీయ చరిత్రపై కాకుండా ఇతర అంశాలపై కేంద్రీకరణ హెచ్చుగా ఉంది. ప్రతి అధ్యాయంలోను ఆ కాలానికి చెందిన రాజకీయ చరిత్రను ప్రత్యేకంగా పేర్కొన్నాను. అయినప్పటికీ తరతరాలుగా వస్తున్న విస్తారమైన, విభిన్నమైన అన్ని జీవిత కోణాల ఆవిష్కరణకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చాను. పాలక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక, మత, సాంస్కృతిక సంస్థలు, ఆచారాలు, విశ్వాసాలను సుబోధకంగా వివరించే ప్రయత్నం చేశాను. పైకి భిన్నత్�... See more
భారతదేశ చరిత్రను అంశాల వారీగా, శాస్త్రబద్ధంగా పరిశీలించి, వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం అని ముందుగా చెప్పాలి. పూర్తిగా భిన్నమైన, నూతన ప్రణాళికతో ఈ పుస్తకాన్ని రచించానని వేరుగా చెప్పనవసరం లేదు. దీనిలో రాజకీయ చరిత్రపై కాకుండా ఇతర అంశాలపై కేంద్రీకరణ హెచ్చుగా ఉంది. ప్రతి అధ్యాయంలోను ఆ కాలానికి చెందిన రాజకీయ చరిత్రను ప్రత్యేకంగా పేర్కొన్నాను. అయినప్పటికీ తరతరాలుగా వస్తున్న విస్తారమైన, విభిన్నమైన అన్ని జీవిత కోణాల ఆవిష్కరణకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చాను. పాలక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక, మత, సాంస్కృతిక సంస్థలు, ఆచారాలు, విశ్వాసాలను సుబోధకంగా వివరించే ప్రయత్నం చేశాను. పైకి భిన్నత్వం కనిపిస్తున్నప్పటికీ భారత దేశ చరిత్ర మొత్తంలోను అంతర్లీనంగా కొనసాగిన ఏకత్వాన్ని చూపించాను. వివిధ దశల్లో చరిత్రను ప్రభావితం చేసిన రకరకాల శక్తుల గురించి విశ్లేషించడానికి శాయశక్తులా ప్రయత్నించాను. సామాజిక మార్పుకు దోహదపడి అవి చరిత్రను ఎలా తీర్చిదిద్దాయో తెలియ చేశాను. దురదృష్టవశాత్తు అనేక రిఫరెన్సు గ్రంథాలలో సామాన్యుడి గురించి కాని, దేశ సాంస్కృతిక వారసత్వం గురించి కాని తగినంత చెప్పకపోవడమే కాకుండా, ఆ చెప్పినది కూడ ఒక పద్ధతి ప్రకారం లేదు. ఈ పుస్తకంలో నూతన ప్రణాళికను అనుసరించడం ద్వారా ఆ లోపాలను అధిగమించే ప్రయత్నం జరిగింది. అంతేకాదు ఆధునిక యుగానికి సంబంధించిన భాగంలో విద్యార్థుల అవసరాలను గమనంలో ఉంచుకొని విషయాలను పొందుపరిచాను. భారత స్వాతంత్య్రపోరాటాన్ని వివరించే సమయంలో వాస్తవాలకు అనుగుణంగా ఉన్నదున్నట్లు చెప్పడానికి కృషి చేశాను. - కూనం కృష్ణారెడ్డి